Wednesday, 15 September 2021

జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!

 

జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..


తెలుగులో వాయిస్ టైపింగ్.. అంటే మనం మాట్లాడితే నేరుగా తెలుగు భాషలో టైపింగ్ అయిపోవడమన్న మాట. ఇది ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. గూగుల్ సంస్థ గూగుల్ వాయిస్ టైపింగ్ లో తెలుగు భాషను కూడా ప్రవేశపెట్టింది. దీనిని చాలా మంది ఉపయోగిస్తున్నారు కూడా. అయితే అదే తెలుగు వాయిస్ టైపింగ్ ను కంప్యూటర్ లోనూ పొందడానికి మంచి ట్రిక్ అందుబాటులో ఉంది. అయితే ఇందులోనూ తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటుంది. మనం ఫోన్ లో వాయిస్ టైపింగ్ చేస్తూ ఉంటే నేరుగా కంప్యూటర్లో కూడా టైపింగ్ అయిపోతుంటుంది

అంతేకాదు మన కంప్యూటర్ కు వైర్ లెస్ మౌస్ గా, వైర్ లెస్ కీబోర్డుగా కూడా పనిచేస్తుంది. కంప్యూటర్ లో పాటలు, వీడియోలను ప్లే చేయడం, నేరుగా సౌండ్ పెంచడం, తగ్గించడం వంటివీ చేసుకోవచ్చు. మరి కంప్యూటర్ లో తెలుగు వాయిస్ టైపింగ్, వైర్ లెస్ కీబోర్డు, మౌస్ గా మన స్మార్ట్ ఫోన్ ను ఎలా వినియోగించాలో చూద్దామా?


ముందుగా మీ ఫోన్ లో వాయిస్ టైపింగ్ యాప్ ఉందా.. లేకపోతే ముందు ఫోన్ లో తెలుగు వాయిస్ టైపింగ్ ఎలా చేయాలో ఈ కింది లింకులో చూడండి.
మాటలు విని తెలుగులో టైప్ చేసే అప్లికేషన్.. మీ ఫోన్లో ఉందా?

రెండింటిలో సాఫ్ట్ వేర్లు..

స్మార్ట్ ఫోన్ లో వాయిస్ టైపింగ్ వచ్చేశాక.. కంప్యూటర్లో తెలుగు, ఇంగ్లిష్ వాయిస్ టైపింగ్ కోసం, వైర్ లెస్ మౌస్ గా వినియోగం కోసం కంప్యూటర్ లో ఒక సాఫ్ట్ వేర్, ఫోన్ లో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఒక పెయిర్ (సర్వర్-క్లయింట్ సాఫ్ట్ వేర్) గా చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒక దానికొకటి సింక్రనైజ్ అయి.. కంప్యూటర్ మీ మొబైల్ నియంత్రణలోకి వస్తుంది. ఇలాంటి పెయిర్ సాఫ్ట్ వేర్, యాప్ లు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని పెయిడ్ కాగా.. చాలా వరకు ఫ్రీగా లభిస్తాయి. ఉదాహరణకు కొన్ని సాఫ్ట్ వేర్-యాప్ పెయిర్లు..
  • యూనిఫైడ్ రిమోట్ (Unified Remote)
  • రిమోట్ మౌస్ (Remote Mouse)
  • రిమోట్ లింక్ (Remote Link)
  • వైఫై మౌస్ (Wifi Mouse)
  • రిమోట్ కంట్రోల్ కలెక్షన్ (Remote Control Collection
  • మొత్తంగా కంప్యూటర్ లో తెలుగు వాయిస్ టైపింగ్ కోసం ఉండాల్సినవి..

    • ఒక ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్
    • రెండింటిలోనూ పెయిర్ సాఫ్ట్ వేర్ (క్లయింట్-సర్వర్) సాఫ్ట్ వేర్
    • ఫోన్ లో గూగుల్ ఇన్ పుట్ టూల్స్. దీనిలో తెలుగు వాయిస్ టైపింగ్ ఎనేబుల్ చేసి ఉండాలి
    • వైఫై నెట్ వర్క్ లేదా బ్లూటూత్ అనుసంధానం (పెయిరింగ్).
    • వైఫై అయితే కంప్యూటర్, ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఒకే వైఫై నెట్ వర్క్ పరిధిలో ఉండాలి. అంటే మన ఇంట్లో కేబుల్ బ్రాడ్ బ్యాండ్ ఉండి దానికి వైఫై రూటర్ ను అమర్చుకుని ఉంటే చాలు.
    • బ్లూటూత్ అయితే కంప్యూటర్ కు బ్లూటూత్ డాంగిల్ పెట్టుకుని ఉండాలి, ల్యాప్ టాప్ అయితే బ్లూటూత్ ఇన్ బిల్ట్ గా కూడా వస్తుంది.
    • మొత్తంగా కంప్యూటర్, ఫోన్ రెండూ కూడా బ్లూటూత్ ద్వారా పెయిర్ అయి ఉండాలి.
    • కొన్ని రకాల యాప్ లు మాత్రం ఒకే వైఫై నెట్ వర్క్ అవసరం లేకుండా.. మొత్తంగా ఇంటర్ నెట్ కు అనుసంధానం అయి ఉంటే చాలు పని చేస్తాయి. కానీ అవి సమర్థవంతంగా పని చేయలేవు. అలాంటి వాటికి గూగుల్ ప్లే స్టోర్ లో రేటింగ్ కూడా తక్కువగా ఉంది.

    ఇవి గుర్తుంచుకోండి

    ఈ తరహా సర్వర్-క్లయింట్ సాఫ్ట్ వేర్లు పని చేయాలంటే మన కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ సీ++ రీడిస్ట్రిబ్యుటబుల్ అప్లికేషన్ గానీ, మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ గానీ ఉండి తీరాలి. అయితే కంప్యూటర్ లో మనం సర్వర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసేటప్పుడే.. మన కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ సీ++ రీడిస్ట్రిబ్యుటబుల్ అప్లికేషన్ గానీ, మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఉందా లేదా అన్నది ఆయా సాఫ్ట్ వేర్ల ఇన్ స్టలేషన్ ప్రక్రియే పరిశీలిస్తుంది. అవి లేనట్లయితే.. వాటిని డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయాలా? అని అడుగుతుంది. దానికి ఓకే చేస్తే సరిపోతుంది.ఈ ఇన్ స్టలేషన్ ల కోసం పెద్దగా డేటా కూడా ఖర్చు కాదు. కేవలం 100 నుంచి 150 ఎంబీ లోపే వినియోగమవుతుంది.

ఇదిగో ఇలా చేేస్తే సరి..

 తెలుగు వాయిస్ టైపింగ్, వైర్ లెస్ కీబోర్డు, మౌస్ గా వినియోగం ఎలా ఉంటుందో చూద్దాం. ఇందుకోసం ఉదాహరణగా Remote Link సాఫ్ట్ వేర్ ను చూద్దాం. ముందుగా స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి Remote Link యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • తర్వాత కంప్యూటర్ లో http://remotelink.asus.com/ వెబ్ సైట్ నుంచి రిమోట్ లింక్ సర్వర్ సాఫ్ట్వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్ వేర్ పని చేయాలంటే.. మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ 4 మన కంప్యూటర్ లో ఉండాలి. లేకుంటే రిమోట్ లింక్ ఇన్ స్టాలేషన్ సమయంలోనే డాట్ నెట్ 4 ఇన్ స్టాల్ చేయాలా.. అని అడుగుతుంది. ఆ లింకు నుంచి మైక్రో సాఫ్ట్ వెబ్ సైట్ కు వెళ్లి డాట్ నెట్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అనంతరం రిమోట్ లింక్ ఇన్ స్టాల్ అవుతుంది. అదే యూనిఫైడ్ రిమోట్ సాఫ్ట్ వేర్ కు అయితే మైక్రోసాఫ్ట్ సీ++ రీడిస్ట్రిబ్యుటబుల్ ను ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది.
  • అటు కంప్యూటర్, ఇటు స్మార్ట్ ఫోన్ లోను సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేశాక.. రెండింటిలోనూ వాటిని ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు రిమోట్ లింక్ యాప్ లో సెర్చ్ డివైజ్ ఆప్షన్ పై టాప్ చేయాలి. దాంతో సెలెక్ట్ డివైజ్ అని పాప్ అప్ ఓపెన్ అయి.. అందులో రిమోట్ లింక్ సర్వర్ ఇన్ స్టాల్ అయి ఉన్న కంప్యూటర్ల పేర్లు కనిపిస్తాయి.
  • ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే.. ఈ స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ కూడా ఒకే వైఫై నెట్ వర్క్ పరిధిలో ఉండాలి. ఒక వైఫై నెట్ వర్క్ పరిధిలో ఎక్కువ కంప్యూటర్లు ఉండి.. వాటిల్లో రిమోట్ లింక్ సర్వర్ ఇన్ స్టాల్ చేసి ఉంటే.. వాటన్నింటి జాబితాను ఫోన్ లో చూపిస్తుంది. అందులో మనకు కావాల్సిన కంప్యూటర్ ను ఎంచుకుని సెలెక్ట్ చేయగానే.. ఆటోమేటిగ్గా కంప్యూటర్, ఫోన్ అనుసంధానం అవుతాయి.

ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి?

కంప్యూటర్ లోని సర్వర్ సాఫ్ట్ వేర్, స్మార్ట్ ఫోన్ లోని యాప్ రెండూ అనుసంధానం అయ్యాక ఈ పక్కన ఉన్నట్లుగా డిస్ప్లే వస్తుంది. ఇందులో ముందుగా ల్యాప్ టాప్ మౌస్ తరహాలో ఉపయోగించుకోగల ‘మౌస్ ప్యాడ్’ స్పేస్, దాని కింద మౌస్ ఎడమ, కుడి బటన్ల తరహాలో వినియోగించే రెండు ఆప్షన్లు L, R పేర్లతో అందుబాటులో ఉంటాయి.
  • మౌస్ ప్యాడ్ పైన రెండు యారోలు ఉండే మార్క్, దాని పక్కన చిన్న కీబోర్డు, ఆ పక్కన మూడు చుక్కల ఆప్షన్ పెల్లెట్ ఉంటాయి. యారో మార్క్ ను క్లిక్ చేస్తే.. మౌస్ ప్యాడ్ కింద జూమింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది విండోస్ లోని కొన్ని అప్లికేషన్లలో జూమ్ ఆప్షన్ లా పనిచేస్తుంది. కీబోర్డు బటన్ ను క్లిక్ చేస్తే.. కింద టెక్స్ట్ మెస్సేజ్ బాక్స్ వస్తుంది, ఆటోమేటిగ్గా ఫోన్ కీ బోర్డు కూడా ఓపెన్ అవుతుంది. పక్కన మూడు చుక్కల ఆప్షన్ పెల్లెట్ ను క్లిక్ చేస్తే.. పలు రకాల ఆప్షన్లు వస్తాయి.
  • ఇక మౌస్ ప్యాడ్ కింద నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది మౌస్ ప్యాడ్, కీబోర్డులను అందుబాటులో ఉంచే ఆప్షన్, రెండోది కంప్యూటర్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేందుకు తోడ్పడుతుంది. మూడో ఆప్షన్ కంప్యూటర్ లో విండోస్ మీడియా ప్లేయర్ ను కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. అంటే విండోస్ మీడియా ప్లేయర్ లో ఏవైనా పాటలు గానీ, వీడియోలుగానీ ప్లే చేస్తే.. దూరంగా కూర్చుని చూడొచ్చు, వినొచ్చు. మార్చాలనుకున్నా, పాస్, ప్లే చేయాలనుకున్నా.. జస్ట్ ఫోన్ లోంచి దూరం నుంచే చేయవచ్చు. నాలుగో ఆప్షన్ లో కంప్యూటర్ షట్ డౌన్ చేయడం, రీ స్టార్ట్ చేయడం, లాగాఫ్ చేయడం వంటి పలు ఆప్షన్లు ఉంటాయి.

వాయిస్ టైపింగ్ చేయండి ఇలా..

  • ముందుగా కంప్యూటర్ లోని సర్వర్ సాఫ్ట్ వేర్, ఫోన్ లోని యాప్ అనుసంధానం అయ్యాయా లేదా సరి చూసుకోవాలి. అనుసంధానం అయితే కంప్యూటర్ టాస్క్ బార్ పై ‘ASUS Smart Gesture’ ఐకాన్ కనిపించి.. ఫోన్ తో అనుసంధానం అయినట్లుగా నోటిఫికేషన్ చూపిస్తుంది.
  • ఇక కంప్యూటర్ లో నోట్ ప్యాడ్, వర్డ్ లేదా మీ మెయిల్, ఫేస్ బుక్ వాల్ వంటి మనం టైప్ చేయాల్సిన చోటిని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అందులో కర్సర్ ఉంచి ఒకటి రెండు అక్షరాలు టైప్ చేసి చూసుకోవాలి.
  • తర్వాత స్మార్ట్ ఫోన్ లోని Remote Link యాప్ లో పైన ఉండే కీబోర్డు ఐకాన్ పై ప్రెస్ చేయాలి. దాంతో ఆటోమేటిగ్గా మెస్సేజ్ టైప్ చేసేలా ఆప్షన్ వస్తుంది. ఫోన్ లో కీబోర్డు కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వాయిస్ టైపింగ్ కు అంతా సిద్ధంగా ఉన్నట్లన్న మాట.
  • కీబోర్డు ఐకాన్ పక్కన మైక్ ఐకాన్ ను గానీ, ఫోన్ కీబోర్డు లోని మైక్ ఐకాన్ ను గానీ ప్రెస్ చేయగానే.. గూగుల్ వాయిస్ టైపింగ్ కమాండ్ ఓపెన్ అవుతుంది. మనం మాట్లాడుతున్న కొద్దీ ఆటోమేటిగ్గా టైపింగ్ అయి పోతుంది. అయితే పైన కీబోర్డు బొమ్మ పక్కన ఉన్న మైక్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే ఒకటి రెండు మాటలు మాట్లాడగానే క్లోజ్ అయిపోతుంది. అదే ఫోన్ కీబోర్డులోని మైక్ ఐకాన్ ను టాప్ చేస్తే.. మాట్లాడినంత సేపూ టైప్ అవుతూనే ఉంటుంది.
  • ఇలా టైప్ అయిన అక్షరాలకు పక్కన ఉండే సెండ్ ఆప్షన్ (పేపర్ ఫ్లైట్ బొమ్మ)పై టాప్ చేయగానే.. టెక్స్ట్ అంతా కంప్యూటర్ లో మనం ఓపెన్ చేసి పెట్టిన నోట్ ప్యాడ్, ఫేస్ బుక్ వాల్ లేదా ఇతర అప్లికేషన్ లో కనిపిస్తుంటుంది. 

సరైన తెలుగు రావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఫోన్ ను దూరంగా పెట్టుకుని మాట్లాడినా.. స్పష్టంగా మాట్లాడకపోయినా.. పక్కన ఇతరులు మాట్లాడుతున్నా.. వాయిస్ టైపింగ్ లో తప్పులు వస్తుంటాయి. అందువల్ల ఫోన్ ను దగ్గరగా పెట్టుకుని, స్పష్టంగా మాట్లాడాలి. ఇంగ్లిషు పదాలు మాట్లాడితే కొన్ని సార్లు ఇంగ్లిషులోనే టైప్ అవుతుంటాయి. అందువల్ల కాస్త స్పష్టంగా మాట్లాడితే ఆ పదాలు కూడా తెలుగులోనే టైప్ అవుతుంటాయి. మనకు కావాల్సింది టైప్ చేయగానే.. కంప్యూటర్ లోకి సెండ్ చేసేస్తే సరిపోతుంది.
  • ఇలా తెలుగు, ఇంగ్లిష్ లేదా ఇతర భాషల టైపింగ్ కోసం  మనం కంప్యూటర్ ఎదుటే కూర్చోవాల్సిన పని లేదు. ఫోన్ ను పట్టుకుని హాయిగా కుర్చీలోనో, సోఫాలోనో కూర్చుని టైప్ చేయవచ్చు.
  • ఇంకా చెప్పాలంటే ఫోన్ ను కూడా చేతిలో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా హెడ్ ఫోన్ గానీ, బ్లూటూత్ డివైజ్ గానీ పెట్టుకుని మనం మాట్లాడుతుంటే.. అటు ఫోన్లో టైప్ అయిపోతుంటాయి. సెండ్ బటన్ నొక్కగానే కంప్యూటర్ లోకి టెక్ట్స్ వచ్చేస్తుంటుంది.

వైర్ లెస్ మౌస్, కీబోర్డుగా..

ఇక ఈ రిమోట్ సాఫ్ట్ వేర్లతో ఉన్న మంచి సౌలభ్యం వైర్ లెస్ మౌస్, వైర్ లెస్ కీబోర్డుగా పని చేయడం. మనం కంప్యూటర్ కు కాస్త దూరంగా కూర్చుని కూడా హాయిగా ఏవైనా ఓపెన్ చేయడం,చూసుకోవడం చేయవచ్చు.
  • మొదట మనం రిమోట్ లింక్ యాప్ ను కంప్యూటర్ లోని సర్వర్ సాఫ్ట్ వేర్ తో అనుసంధానం చేయగానే వచ్చే స్క్రీన్ రిమోట్ మౌస్ గా పని చేస్తుంది. ల్యాప్ టాప్ లకు ఉండే టచ్ ప్యాడ్ ల తరహాలో ఇది పని చేస్తుంది. ‘అసుస్ స్మార్ట గెశ్చర్’ అని బ్యాక్ గ్రౌండ్ లో కనిపించే ఈ ప్రదేశంలో వేలితో డ్రాగ్ చేస్తుంటే.. కంప్యూటర్ లో మౌస్ కర్సర్ కదులుతుంటుంది. 
  • అలా ఏదైనా ఫోల్డర్, ఐకాన్ పైకి కర్సర్ ను తీసుకెళ్లి ఒకసారి ఫోన్ లో టాప్ చేస్తే (మౌస్ లెఫ్ట్ క్లిక్ తరహాలో).. కంప్యూటర్ లో ఆ ఫోల్డర్ లేదా ఐకాన్ సెలక్ట్ అవుతుంది. అదే రెండు సార్లు వెంట వెంటనే ట్యాప్ చేస్తే (మౌస్ డబుల్ క్లిక్ తరహాలో) ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది.
  • ఇక ఫోన్ లో మౌస్ ప్యాడ్ కింద L, R అక్షరాలున్న రెండు బటన్లు మౌస్ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ తరహాలో పనిచేస్తాయి. 
  • ఇక పైన చెప్పుకొన్నట్లు తెలుగు వాయిస్ టైపింగ్ చేసిన తరహాలోనే వైర్ లెస్ కీబోర్డుగా కూడా స్మార్ట్ ఫోన్ ను వినియోగించుకోవచ్చు. రిమోట్ లింక్ యాప్ లో పైన కీబోర్డు ఐకాన్ ను ప్రెస్ చేసినప్పుడు ఫోన్ లో కీబోర్డు ఓపెన్ అవుతుంది. అందులో నేరుగా టైప్ చేసిన కొద్దీ.. పైన మెసేజ్ బాక్స్ లో టైప్ అవుతుంది. సెండ్ బటన్ ప్రెస్ చేయగానే అది కంప్యూటర్ కు వెళుతుంది.
  • అంటే వైర్ లెస్ కీబోర్డు తరహాలో మానిటర్ కు దూరంగా కూర్చుని తెలుగు, ఇంగ్లిష్ ఇలా ఏ భాషలోనైనా టైపింగ్ చేసుకోవచ్చు.

ఇవీ అదనపు సదుపాయాలు..

  • ఆఫీసుల్లో, స్కూళ్లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లు ఇచ్చేటప్పుడు కంప్యూటర్ వద్దే కూర్చోవాల్సిన అవసరం లేకుండా.. రిమోట్ లింక్ వంటి యాప్ లలో పవర్ పాయింట్ కంట్రోల్ ఆప్షన్లు కూడా ఉంటాయి. దీని సహాయంతో స్క్రీన్ కు దూరంగా ఉండి, అవసరమైతే అటూ ఇటూ తిరుగుతూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. 
  • మీడియా ప్లేయర్ కంట్రోల్ కూడా ఇలాంటి రిమోట్ యాప్ లలో ఉండే అదనపు సదుపాయం. కంప్యూటర్ లేదా లాప్ టాప్ లో సినిమాలుగానీ, పాటలు గానీ పెట్టుకున్నప్పుడు దూరంగా కూర్చుని ఆపరేట్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ చేయడానికిగానీ, తర్వాతి పాట, వీడియో పెట్టడానికి గానీ కంప్యూటర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రిమోట్ మౌస్ ఆప్షన్ ఉన్నా.. మానిటర్ లో కర్సర్ కదలికను చూస్తూ, ఆప్షన్ నొక్కాల్సి ఉంటుంది. అదే మీడియా ప్లేయర్ కంట్రోల్ తో కంప్యూటర్ వైపు చూడాల్సిన పని లేకుండానే మార్చుకోవచ్చు. 
  • చివరిగా ఉండే ఆప్షన్లతో కంప్యూటర్ ను దూరం నుంచే లాగాఫ్, షట్ డౌన్, స్లీప్, రీస్టార్ట్ వంటివి చేసుకోవచ్చు.

లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'

 

దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీపడుతున్న భారత్ ను నిరుద్యోగ సమస్య ఇప్పటికీ పీడిస్తూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను తీసుకుంటున్నప్పటికీ నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. ఉన్నత విద్యలను అభ్యసించిన ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. చదువుకు తగ్గ అవకాశాలు లేకపోవడం దీనికి ఒక కారణమయితే... సరైన నైపుణ్యాలు లేకపోవడం కూడా మరో కారణం. ఎందరో విద్యార్థులు, నిరుద్యోగులకు అసలు ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. 130 కోట్ల జనాభా కలిగిన భారత్ లో మూడింట రెండు వంతుల మంది 35 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఎన్నో ప్రముఖ సంస్థలు నిరుద్యోగులకు చేయూతను అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. వీటిలో టాటా గ్రూపు కూడా ఒకటి. 'టాటా స్ట్రైవ్' పేరుతో ఆ సంస్థ నిరుద్యోగుల పాలిట వరప్రదాయినిగా మారింది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా సర్టిఫికెట్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ, వారికి ప్లేస్ మెంట్లను కూడా కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా నెలకొల్పిన టాటా స్ట్రైవ్ క్యాంపస్ లలో వేలాది మంది తమ కోర్సులను పూర్తి చేసుకుని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఈ సంస్థ గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. అందరికీ ఈ గొప్ప అవకాశం గురించి తెలియజేయడం కోసమే ap7am.com ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం గురించి తమ సొంత వ్యక్తులకే కాకుండా... తెలిసిన వారికి, నిరుద్యోగులకు వివరించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు సహకరిస్తారని ఆశిస్తున్నాం.

హైదరాబాదు తో పాటు అలీగఢ్, నాసిక్, మొహాలీ, ముంబై, పూణేల్లో టాటాస్ట్రైవ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు పలు చోట్ల ఎక్స్ టెన్షన్ సెంటర్లు, పార్ట్ నర్ సెంటర్లను నెలకొల్పారు. హైదరాబాదులోని కేపీహెచ్ బీ కాలనీలో ఉన్న సెంటర్ లో బీపీవో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవెలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్, ఫుడ్ అండ్ బివరేజర్ సర్వీస్ స్టీవార్డ్, హౌస్ కీపింగ్ ఆపరేషన్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఆటొమొబైల్ సేల్స్ కన్సల్టెంట్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ అసోసియేట్, రీటెయిల్ సేల్స్ అసోసియేట్, మల్టీ క్యుజిన్ కుక్, బ్యూటీ అడ్వైజర్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 4 వారాల నుంచి 17 వారాల వరకు కొనసాగే ఈ కోర్సులను టాటా స్ట్రైవ్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత వీరందరికీ అత్యున్నత బ్రాండ్ కంపెనీల్లో ప్లేస్ మెంట్లు పొందేందుకు సహకరిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులందరూ దాదాపుగా ఉద్యోగాలు పొందారు. స్టార్ హోటళ్లు, టాప్ బ్రాండెడ్ కంపెనీల్లో పని చేస్తున్నారు. 

ఉచితంగా కార్పొరేట్ స్థాయి శిక్షణ:

టాటా స్ట్రైవ్ సెంటర్లన్నీ కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి. ఈ సెంటర్లో అడుగు పెట్టిన మరుక్షణమే విద్యార్థుల్లో ప్రొఫెషనలిజం నిండేలా పరిసరాలు ఉంటాయి. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు ఖర్చయ్యే కోర్సులను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. అత్యున్నత స్థాయి ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు యూనిఫాం కూడా ఫ్రీగా ఇస్తుండటం గమనార్హం. అయితే హాస్టల్ వసతిని మాత్రం ఎవరికి వారే చూసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ కోర్సులకు అర్హులు.
 విద్యార్థులు కోర్సులు ఎంపిక చేసుకునే విధానం:
ఇక్కడకు వచ్చే విద్యార్థులకు తొలుత ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకుంటారు. అల్గోరిథమ్ అప్రోచ్ అనే విధానం ద్వారా పిక్చర్ బేస్ట్ అసెస్ మెంట్ చేస్తారు. కంప్యూటర్ లో 60 నుంచి 65 ఫొటోలను గుర్తించే టెస్ట్ పెడతారు. విద్యార్థులు గుర్తించే ఫొటోల ద్వారా వారి ఆసక్తిని అంచనా వేసి, ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తారు. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే శిక్షణను ఇస్తే.. విద్యార్థులు మరింతగా రాణిస్తారనేదే ఈ టెస్ట్ లక్ష్యం.

  కోర్సులో శిక్షణ పొందాలి అనే విషయాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత... విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో వివరిస్తారు. ఈ సెషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తారు. తద్వారా తమ పిల్లలు ఎలాంటి శిక్షణను పొందబోతున్నారనే విషయం వారికి కూడా అర్థమవుతుంది. తమ పిల్లల భవిష్యత్తుపై ఒక భరోసా ఏర్పడుతుంది.

తొలి 12 రోజులు విద్యార్థులకు కేవలం వారి లక్ష్యాలు, ఆలోచనలకు సంబంధించిన బోధన ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా క్లాసులు ఉంటాయి. 12 రోజులు పూర్తైన తర్వాత కోర్సులో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయాన్ని సదరు విద్యార్థి తీసుకోవచ్చు. కోర్సులో కొనసాగాలనుకునే విద్యార్థికి 13వ రోజు నుంచి అసలైన శిక్షణ ప్రారంభమవుతుంది. క్లాసులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. శిక్షణలో భాగంగా అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులతో పాటు ప్రాజెక్ట్ బేస్డ్ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. ఆన్ జాబ్ ట్రైనింగ్ పద్ధతిలో శిక్షణ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్లకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు టాప్ లెవెల్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా టాటా స్ట్రైవ్ సహకారం అందిస్తుంది.

ఆసక్తిగలవారు సంప్రదించాల్సిన చిరునామా:
టాటా స్ట్రైవ్,
ఎన్ఎస్ఎల్ సెంట్రమ్ మాల్,
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన,
కేపీహెచ్ బీ ఫేజ్-3,
హైదరాబాద్.
ఫోన్: 040 67190400
సెల్: 8919302506



CLICK THE BELOW BLUE COLOUR LINK FOR INFORMATION


టాటా స్ట్రైవ్ TATA STRIVE

Thursday, 15 September 2016

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు మనమే చేసుకుందాం!


ఆధార్ కార్డు తీసుకున్నాం.. పేరులో తప్పు దొర్లింది... లేదా చిరునామా మారింది.  పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లేదా ఇతరత్రా సమాచారంలో ఏదేనీ మార్పులు చోటు చేసుకుంటే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం. నెట్ సదుపాయం ఉంటే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లి స్వయంగా మనమే సరిచేసుకోవచ్చు. అదెలానో చూద్దాం... 
ముందుగా 
https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం. 
ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది. 
కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకుhttps://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు. 
ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది. 
రిజిస్టర్ మొబైల్ నంబర్ మనుగడలో లేకుంటే
ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది. కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు. 
చిరునామాలు
Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India.
Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad – 500034, India.
కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి. 

రైల్వే చార్జీల్లో రాయితీలు ఎవరెవరికి.. ఎంతెంత?

దేశంలో అత్యధిక జనాభాకు అనుకూలమైన, చవకైన రవాణా వ్యవస్థ రైల్వే. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చే భారతీయ రైల్వే... మనలో కొన్ని వర్గాల వారికి టికెట్ చార్జీల్లో భారీగా రాయితీలు అందిస్తోంది. వాటి వివరాలేంటో చూద్దాం. 
విద్యార్థులు, వికలాంగులు, ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారు, వైద్యులు, జర్నలిస్టులు, కళాకారులు, వృద్ధులు, జాతీయ పురస్కార గ్రహీతలు, అమరవీరుల భార్యలు, స్వాతంత్ర్య సమర యోధులు, క్రీడాకారులు, రైతు వర్గాల వారికి వివిధ రూపాలలో రాయితీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు అన్ని వర్గాల వారికీ అనువైన సీజన్ టికెట్ ఉండనే ఉంది. 
15 రోజుల చార్జీకే
రెండు ప్రాంతాల మధ్య తరచూ ప్రయాణించే వారికి సీజన్ టికెట్లు అనువైనవి. నెలలో 15 రోజుల రానుపోను చార్జీ పెట్టుకుంటే మిగిలిన 15 రోజులు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. సాధారణంగా 150 కిలోమీటర్ల పరిధి మేరకు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించేవారికి సీజన్ టికెట్లు జారీ చేస్తారు. సాధారణ, ఎక్స్ ప్రెస్ రైళ్లలో వీటితో ప్రయాణించవచ్చు. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించాలంటే అదనంగా సర్ చార్జీ టికెట్ తీసుకోవాలి. తగిన గుర్తింపు పత్రాలతో రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి సీజన్ టికెట్లు పొందవచ్చు. సీజన్ టికెట్ తో పాటు రైల్వే సిబ్బంది గుర్తింపు కార్డు కూడా జారీ చేస్తారు. ప్రయాణ సమయంలో ఈ రెండూ దగ్గర ఉంచుకోవాలి. గడువు తీరడానికి 3 రోజుల ముందు నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు. 
విద్యార్థులకు మరింత చౌక
విద్యార్థులకు సీజన్ టికెట్లను సాధారణ సీజన్ టికెట్లలో సగం చార్జీకే పొందవచ్చు. మూడు నెలలకు ఒకేసారి తీసుకోవాలని అనుకుంటే ఇంకొంత తగ్గింపు లభిస్తుంది. పదో తరగతి వరకు అబ్బాయిలకు, ఇంటర్ వరకు విద్యార్థినులకు పాస్ లు ఉచితం. అంటే తమ నివాస ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల్లోని స్కూళ్లు, కళాశాలలకు వెళ్లేందుకు వీలుగా వీటిని జారీ చేస్తారు. వీటితో పాసింజర్ రైళ్లలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు.  రైల్వే టికెట్ కౌంటర్ నుంచి నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని తీసుకుని దాన్ని స్కూల్ లేదా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అటెస్టేషన్ చేయించి సమర్పించాల్సి ఉంటుంది. ఇక పెద్దల సీజన్ టికెట్ చార్జీలో సగానికే బాల, బాలికలు సీజన్ టికెట్ పొందవచ్చు.  అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికులు అంటే కూరగాయల విక్రేతలు, ఇళ్లల్లో పనివారు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణరంగ కార్మికులకు మిగిలిన వారితో పోలిస్తే  100 కిలోమీటర్ల పరిధిలో చాలా తక్కువ ధరకే సీజన్ టికెట్లను రైల్వే అందిస్తోంది. 
వృద్ధులకు సముచిత గౌరవం
వృద్ధులకు అన్ని తరగతుల్లోనూ రైల్వే భారీ రాయితీలిస్తోంది. 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ చార్జీల్లో 40 శాతం తగ్గింపు... 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం తగ్గింపునిస్తోంది. అంతేకాదు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ వయసు ఎక్కువగా చూపించి రాయితీ పొందితే తనిఖీల సందర్భంగా పట్టుబడితే టికెట్ చార్జీల్లో తేడాను వసూలు చేయడంతోపాటు జరిమానా కూడా విధిస్తారు. 
విజ్ఞాన యాత్రలకూ తగ్గింపు
విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళుతుంటే ముందుగా రైల్వే అధికారులను సంప్రదించినట్టయితే సెకండ్ క్లాస్ లో 50 శాతం రాయితీ లభిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు అయితే ఈ రాయితీ 75 శాతం వరకు అందుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడాదికోసారి స్టడీ టూర్ ఏర్పాటు చేసుకుని సెకండ్ క్లాస్ టికెట్ చార్జీల్లో 75 శాతం రాయితీ పొందవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ప్రవేశ పరీక్షల కోసం వెళుతున్నట్టయితే టికెట్ చార్జీలో 75 శాతం రాయితీ అందుకోవచ్చు. ఇక యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాస్తున్న వారు 50 శాతం తగ్గింపు ధరకే టికెట్లు పొందవచ్చు. రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనల కోసం వెళుతున్నట్టయితే వారు కూడా 50 శాతం తగ్గింపు అందుకోవచ్చు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి 50 నుంచి 100 శాతం రాయితీ ఉంది. 
వికలాంగులకు  
శారీరక వైకల్యంతోపాటు, మానసిక వైకల్యం ఉన్న వారికి రైల్వే శాఖ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, 3ఏసీ, ఏసీ చైర్ కార్ లలో 75 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది.1ఏసీ, 2ఏసీలో 50 శాతం రాయితీనిస్తోంది. వెంట ఉన్న ఓ సహాయకుడికి కూడా టికెట్ చార్జీలో ఇంతే మొత్తం రాయితీ లభిస్తుంది. అదే చెవిటి, మూగ వర్గాల వారు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్ లలో 50 శాతం రాయితీ అందుకోవచ్చు. వికలాంగులు డిస్కౌంట్ కోసం గాను ఐకార్డు తీసుకోవాలి. ఇందుకు గాను రైల్వే కౌంటర్ల వద్ద నిర్ణీత ఫామ్ పూర్తి చేసి వైకల్య ధ్రువీకరణ, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాణాంతక వ్యాధులున్నవారికి.... 
కేన్సర్ పేషెంట్లు తరచూ వైద్య చికిత్సలకు రైళ్లల్లో ప్రయాణిస్తుంటే తరగతులనుబట్టి 50 నుంచి 100 శాతం వరకు రాయితీ అందుకోవచ్చు. వెంట సాయంగా వచ్చే వారికి కూడా ఇదే వర్తిస్తుంది. తలసీమియా వ్యాధిగ్రస్తులకు, గుండె శస్త్రచికిత్సలకు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు వెళుతున్నవారు, హీమోఫీలియా, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్, అనీమియా, సికిల్ సెల్ అనీమియా పేషెంట్లకు కూడా 50 నుంచి 75 శాతం వరకు రాయితీ ఉంది. 
రాయితీల విషయంలో ఇంకా పూర్తి వివరాలకు ఈ లింక్ ను చూడగలరు.http://www.indianrail.gov.in/  http://www.indianrailways.gov.in/  అలాగే టికెట్ చార్జీల కోసం http://www.indianrail.gov.in/  ఈ లింక్ ఉపయోగపడుతుంది. 

ఏ సమస్యకు ఏ వైద్యుడు...?


సుమతికి అనుకోకుండా ఓ ఆరోగ్య సమస్య ఎదురైంది. వీలు చూసుకుని ఓ రోజు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. పరీక్షించిన డాక్టర్ డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. అర్థం కాలేదన్నట్టు సుమతి సందేహంగా చూసింది. ఆమెను గమనించిన డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లి చూపించుకోవాలని చెప్పి పంపించారు. 
ఒకప్పుడు సమస్య ఏదైనా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. వారే దాదాపుగా అన్ని రకాల చికిత్సలూ అందించేవారు. సాధారణ వ్యాధులకు ఎంబీబీఎస్ లేదా ఎండీ డాక్టర్... శస్త్ర చికిత్సలు అయితే ఎంఎస్ డాక్టర్లు సేవలు అందించడమన్నది రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్న పరిస్థితి. వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మానవ శరీరంలో ప్రతీ అవయవం ఓ ప్రత్యేక వైద్య విభాగంగా అవతరించింది. వైద్య విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లు చేసి ఆ విభాగానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఆయా విభాగాలు ఏంటో చూద్దాం.. 
జనరల్ ఫిజీషియన్: వీరినే సాధారణ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ అని అంటుంటారు. మందులతో నివారించదగిన సాధారణ వ్యాధులన్నింటికీ వీరు చికిత్సలు అందిస్తారు. అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్ ను వారే సూచిస్తారు. 
గైనకాలజిస్ట్: మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గర్భధారణ, జననేంద్రియ సమస్యలకు చికిత్సల్లో వీరు నిపుణులు. 
ఆబ్సెట్రీషియన్: గైనకాలజీలోనే ఇదో ప్రత్యేక విభాగం. మహిళల పునరుత్పత్తి వ్యవస్థ అంటే సంతాన సాఫల్యత విభాగంలో వీరు స్పెషలిస్ట్.  
పెడియాట్రీషియన్: చిన్న పిల్లలకు ఎంతో శ్రద్ధ, జాగ్రత్తతో కూడిన వైద్యం అవసరం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 16 ఏళ్ల వయసు వారికి వీరు వైద్య సేవలు అందిస్తుంటారు. 
నియోనాటాలజిస్ట్: రోజుల శిశువులు (నవజాత శిశువులు) ముందే పుట్టిన శిశువులకు కీలక వైద్య సేవలు అందించగల నిపుణులు. 
ఆప్తమాలజస్ట్: కంటి వైద్యులు.. కంటి సమస్యలకు వైద్యం చేయడంలో వీరు నిపుణులు. 
డెర్మటాలజిస్ట్: వీరినే చర్మ వైద్యులు అని కూడా అంటుంటారు. సాధారణంగా మిగతా అనారోగ్య సమస్యలకు, చర్మ వ్యాధులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యలలో డెర్మటాలజిస్ట్ సేవలు తప్పనిసరి అవుతాయి. 
ఈఎన్టీ డాక్టర్: చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి వచ్చే సమస్యలకు వీరు చికిత్సలు అందిస్తుంటారు. తరచుగా ముక్కులు మూసుకుపోతుండడం, గొంతులో మంట, నొప్పి, ఆహారం మింగుడు పడకపోవడం, వినికిడి లోపాలు... ఇలా ఈ మూడు విభాగాలకు సంబంధించిన సమస్యలలో వీరు నిపుణులు. 
ఆర్థోపెడిక్: ఎముకలకు సంబంధించిన వ్యాధులు, సమస్యల వైద్యంలో వీరు నిష్ణాతులు. ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్సల నిపుణులను ఆర్థోపెడిక్ సర్జన్లుగా పేర్కొంటారు. 
రుమటాలజిస్ట్: కీళ్ల వ్యాధి నిపుణులు. కీళ్లలో వాపులు, నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలకు వైద్య సేవలు అందిస్తారు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యం కారణంగా తలెత్తే రుమార్థరైటిస్ కు కూడా చికిత్స అందిస్తారు.   
ఇమ్యునోలజిస్ట్: రోగ నిరోధక వ్యవస్థ విఫలమైనా, బలహీన పడినా తద్వారా ఎదురయ్యే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వీరు చికిత్సలు అందిస్తారు. 
యూరాలజిస్ట్: మూత్రాశయ వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. 
కార్డియాలజిస్ట్: అన్నింటిలోకి గుండె ఎంతో విలువైనది. గుండె సంబంధిత వ్యాధి నిపుణులుగా కార్డియాలజిస్టులను పేర్కొంటారు. 
కార్డియో వాస్క్యులర్ సర్జన్: గుండె సంబంధిత శస్త్ర చికిత్సల నిపుణులు. 
న్యూరో ఫిజీషియన్ : వెన్నుపాము, నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులకు మందులు సూచిస్తారు. తలనొప్పి, మెడనొప్పి, వెన్నుపాము నొప్పి, జ్ఞాపక శక్తి లోపం, బీపీ, ఫిట్స్, మెదడులో ట్యూమర్లు తదితర సమస్యలు. ఈ విభాగానికి సంబంధించి శస్త్ర చికిత్స నిపుణులను న్యూరో సర్జన్లుగా పిలుస్తారు. 
డెంటిస్ట్: దంత వైద్య నిపుణులు. ఇందులోనూ మళ్లీ చాలా రకాల స్పెషలిస్టులు ఉంటారు. పళ్ల వరుస మార్చేందుకు, అందంగా తయారు చేసేందుకు, చిన్నారుల దంత సమస్యలకు వివిధ రకాల నిపుణులు ఉంటారు. 
సైకియాట్రిస్ట్: మానసిక పరమైన సమస్యలకు వీరు వైద్యం చేస్తారు. 
పేథాలజస్ట్: లేబొరేటరీ పరీక్షల ద్వారా వ్యాధులు నిర్ధారణ వీరి విధులు. 
రేడియాలజిస్ట్: యంత్రాల సాయంతో ఎక్స్ రేలు, స్కాన్ లు, ఎంఆర్ఐ తదితర పరీక్షలు నిర్వహించి సమస్యలు గుర్తించడం వీరి పని. కేన్సర్ రోగులకు రేడియాలజీ వైద్యసేవలు కూడా అందిస్తుంటారు. 
అనస్థీషియాలజస్ట్: శస్త్ర చికిత్స సమయాల్లో రోగులకు నొప్పి తెలియకుండా ఉండేందుకు వీరు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తుంటారు.  
జనరల్ సర్జన్: సాధారణ శస్త్ర చికిత్సల నిపుణులు. 
ప్లాస్టిక్ సర్జన్: చర్మమార్పిడి, శారీరక అవయవాల నిర్మాణ మార్పిడికి వీరు శస్త్రచికిత్సల సేవలు అందిస్తుంటారు. 
పల్మనాలజస్ట్: ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్య సేవలు అందించడం వీరి పని. వీరినే చెస్ట్ స్పెషలిస్టులు అని కూడా అంటారు. 
ఆంకాలజస్ట్: కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సల నిపుణులు. వీరిలో సర్జరీ చేసే వారిని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. 
నెఫ్రాలజిస్ట్: మూత్ర పిండాల వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించే స్పెషలిస్ట్. 
ఎండ్రోక్రినాలజిస్ట్: గ్రంధులు, హార్మోన్ల సమస్యల నివారణలో వీరు నిష్ణాతులు. హార్మోన్లలో తేడాలు, థైరాయిడ్, మెనోపాజ్ (స్త్రీలలో రుతుచక్రం నిలిచిపోయే దశ), మధుమేహం, జీవక్రియల్లో తేడాలు, ఎదుగుదల లేకపోవడం తదితర సమస్యలకు వీరు వైద్య సేవలు అందిస్తుంటారు. 
హెమటాలజిస్ట్: మానవ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరఫరా అవుతుంటుంది. అదే రక్తానికి ఏమైనా అయితే? అవును అలాంటప్పుడు హెమటాలజిస్ట్ సేవలు అవసరం అవుతాయి. హిమోఫిలియా (రక్తం గడ్డ కట్టని స్థితి), బ్లడ్ కేన్సర్, లింఫ్ గ్రంధుల కేన్సర్, సికిల్ సెల్ అనీమియా తదితర సమస్యలకు వీరు చికిత్స చేస్తారు. హెమటాలజీ అనేది ఇంటర్నల్ మెడిసిన్ లో ఓ విభాగం.
గ్యాస్ట్రాలజిస్ట్: జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎదురయ్యే వ్యాధులకు చికిత్సలు అందిస్తుంటారు. 
ఆండ్రాలజస్ట్: పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి వచ్చే సమస్యలకు వీరు తగిన నిపుణులు. సంతాన సామర్థ్యం లేకపోవడం తదితర సమస్యలకు చికిత్సలు చేస్తారు.  
ఆడియాలజిస్ట్: వినికిడి శక్తి లోపించిన వారికి తగిన మెషిన్ల సాయంతో వినగలిగేలా చేయడం వీరి పని. 
జెనెటిస్జ్: జన్యువులలో సమస్యలు ఉన్నవారికి జెనెటిస్ట్. 
ట్రైకాలజిస్ట్: జుట్టు రాలడం, పల్చబడడం, బ్రేకేజ్ తదితర సమస్యలకు ఈ నిపుణులను సిఫారసు చేస్తుంటారు. వీరు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు కూడా అందిస్తుంటారు. ఇలా పలు విభాగాల్లోనూ మళ్లీ అంతర్లీనంగా మరికొన్ని స్పెషలైజేషన్లు ఉన్నాయి. అందుకే ఏదేనీ ఆరోగ్య సమస్య వదలకుండా వేధిస్తుంటే ముందుగా జనరల్ ఫిజీషియన్ అంటే ఎండీ వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. ఒకవేళ సంబంధిత సమస్యకు ప్రత్యేక వైద్యం అవసరం అనుకుంటే అప్పుడు వారే తగిన నిపుణుడిని సూచిస్తారు. 

ఆరోగ్య బీమా క్లెయింలో మతలబు ఏమిటి?


వంశీధర్ కు ఒక రోజు తల తిరుగుతూ ఉంటే హాస్పిటల్ కు వెళ్లాడు. వాళ్లేమో ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అంటూ అతడ్ని ఆస్పత్రిలో చేర్పించుకుని మూడు రోజుల పాటు ఉంచారు. ఈ మూడు రోజుల్లో వంశీధర్ ఎలాంటి ఆందోళన చెందలేదు. 'ఆరోగ్య బీమా ఉంది కదా, ఏటా 23వేల రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాను, ఏం కాదులే' అంటూ నిశ్చింతగా ఉన్నాడు. కానీ క్లెయిమ్ విషయంలో బీమా కంపెనీ స్పందన చూసి కంగుతిన్నాడు. 42 వేల రూపాయల బిల్లును స్వయంగా చెల్లించి ఉసూరుమంటూ వెనుదిరిగాడు. ఈ మూడు రోజులపాటు ఆస్పత్రిలో తీసుకున్న వైద్యం నగదు రహిత చికిత్సల పరిధిలోకి రాదని బీమా కంపెనీ తరఫున టీపీఏ నుంచి సమాధానం వచ్చింది. అయితే, ఈ స్పందన వంశీధర్ కు ఏ మాత్రం సహేతుకుంగా అనిపించలేదు.
పట్టి పట్టి చూడండి 
ఆరోగ్య బీమా పాలసీ తీసేసుకున్నాం కదా? అని అనుకుంటే చాలదు. అందులో ఉన్న మినహాయింపులు, క్లెయిమ్ విషయంలో, చికిత్సా వ్యయాల్లో ఉన్న పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. దానివల్ల క్లెయిమ్ ల విషయంలో కనీస ప్రాథమిక అవగాహన ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ ఉంటుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పటి వరకు ఉన్న వ్యాధుల సమాచారాన్ని తెలియజేసి వాటికి కూడా కవరేజీ కోరవచ్చు. సాధారణంగా అప్పటి వరకు ఉన్న వ్యాధులకు వెంటనే కాకుండా ఏడాది తర్వాత లేదంటే మూడు నాలుగేళ్ల తర్వాత నుంచి కవరేజీ వర్తిస్తుందని కంపెనీలు నిబంధన విధిస్తాయి. ఆ గడువు తర్వాత నుంచి ముందస్తు వ్యాధులకు కూడా నిశ్చింతగా కవరేజీ పొందవచ్చు. ఈ వేచి ఉండే కాలం అనేది వ్యాధులను బట్టి మారుతుంది. అందుకే పాలసీ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ ముందస్తు వ్యాధుల సమాచారాన్ని తెలియజేయకుంటే.. సమాచారాన్ని కప్పిపెట్టారంటూ క్లెయిమ్ లను కంపెనీలు తిరసర్కించే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు వ్యాధులు, అనారోగ్యం ఇతరత్రా సమాచారాన్ని విధిగా తెలియచేయడం బాధ్యత. 
నిబంధనలు నచ్చకపోతే వదిలించుకోండి
ఫ్రీలుక్ పీరియడ్ అంటూ పాలసీ జారీ తర్వాత బీమా కంపెనీలు కనీసం 15 రోజుల గడువు ఇస్తున్నాయి. పాలసీ పత్రాన్ని సమగ్రంగా చదివి సందేహలు ఉంటే కంపెనీని సంప్రదించాలి. సంతృప్తికరమైన సమాధానం రాకుంటే, పాలసీ పత్రంలోని నిబంధనల పట్ల అయిష్టంగా ఉంటే రద్దు కోరవచ్చు. కట్టిన ప్రీమియంలో కొంత మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీ ప్రపోజల్ పత్రాలను స్వయంగా పూరించడం వల్ల చిదంబర రహస్యాలు తెలుస్తాయి. 
పరిమితులూ ఉన్నాయి
చికిత్సా వ్యయాల్లో పరిమితులు కూడా ఉంటాయి. ఆస్పత్రిలో రూమ్ చార్జీలు, ఐసీయూ చార్జీలు తదితర విషయాల్లో రోజుకు ఇంత మేరకే చెల్లిస్తామని సబ్ లిమిట్స్ ఉంటాయి. ఆస్పత్రిలో కనీసం ఒక రోజు పాటు ఉంటేనే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పాలసీలు డే కేర్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరకపోయినా, వైద్య పరీక్షలు, చికిత్సలకు అయ్యే మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
ఆస్పత్రిలో చేరిన వెంటనే
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో బీమా విభాగం ఉంటుంది. వారి ద్వారా సమాచారాన్ని తెలియజేయవచ్చు. ఆస్పత్రిలో చేరిన 48 గంటల తర్వాత తెలియజేయడం వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. ప్రణాళిక ప్రకారం ఏదేనా చికిత్స కోసం ఫలానా రోజు ఆస్పత్రిలో చేరదామని నిర్ణయించుకుంటే చేరే ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించి ఆమోదం తీసుకోవడం ఉత్తమం. 
ఇలా అయితే తిరస్కరణే!
క్లెయిమ్ పత్రాలు సరిగా లేకుంటే కంపెనీలు నిర్మొహమాటంగా తిరస్కరిస్తాయి. ఎక్స్ రే, సోనోగ్రఫీ తదితర పరీక్షలకు డాక్టర్ ఆమోదం లేకుంటే వాటికి సంబంధించిన చెల్లింపులను నిలిపివేస్తాయి. ఆస్పత్రుల నుంచి పంపే క్లెయిమ్స్ పత్రాల్లో వివరాల నమోదులో తప్పిదం జరిగినా తిరస్కరణకు గురికావచ్చు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారం రోజుల్లోగా క్లెయిమ్ పత్రాలను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ అనంతరం ఖర్చులకు కూడా బీమా క్లెయిమ్ చేసుకునేట్లయితే 60 రోజుల్లోగా బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
మోటారు, హెల్త్ ఇన్సూరెన్సుల్లో తిరస్కరణలు ఎక్కువగా ఉంటుంటాయి. ‘ప్రొసీజర్ వజ్ నాట్ మెడికల్లీ నెసెస్సరీ’ అంటూ వైద్య బీమా కంపెనీలు తిరస్కరిస్తుంటాయి. సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రులు రోగి నుంచి ఎక్కువ రాబట్టుకోవాలని అవసరం లేని పరీక్షలు కూడా చేస్తుంటాయి. అలాంటి అడ్డగోలు ఖర్చులకు బీమా కంపెనీలు చెల్లింపులు చేయవు. 
తీసుకున్న చికిత్స పాలసీ పరిధిలో లేకుంటే, క్లెయిమ్ ఫామ్ సరిగా పూర్తి చేయకుంటే, అవసరం లేని చికిత్సలను ఆస్పత్రుల్లో చేసినట్టయితే, సరైన సమయంలోపు క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకోకుంటే తిరస్కరణకు గురికావచ్చు. అయితే, తిరస్కరణకు గల కారణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ లేదా కంపెనీ తరఫున టీపీఏ తెలియజేస్తుంది. ఈ కారణం సహేతుకంగా లేదని భావిస్తే, తగిన అర్హత ఉందని భావిస్తే మీరు మరోసారి కంపెనీని సంప్రదించవచ్చు. జీవిత బీమానే కాదు... ఏ బీమా పాలసీ అయినా మనుగడ లేకుంటే బీమా వర్తించదు. కనుక నిర్ణీత గడువులోపు ప్రీమియం చెల్లించి పాలసీ ల్యాప్స్ కాకుండా చూసుకోవాలి. 
తిరస్కరణకు గురైతే...
క్లెయిమ్ పత్రాన్ని మరోసారి సమగ్రంగా పరిశీలించండి. పేరు, పాలసీ నంబర్, ఇతర సమాచారం సరిగ్గా ఉన్నాయా? లేదా? సరి చూసుకోవాలి. ఏదైనా తప్పిదం, పొరపాటును గుర్తిస్తే సరిచేసి మళ్లీ మీ క్లెయిమ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని టీపీఏను కోరాలి. అలాగే, పాలసీ క్లెయిమ్ పత్రంతోపాటు జతపరిచిన మిగిలిన వాటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఏవైనా మిస్ అయితే వాటిని జతచేయాలి. వైద్యపరంగా అనవసరంగా చికిత్స చేశారన్న కారణంతో క్లెయిమ్ తిరస్కరణకు గురైతే... వైద్య సలహా తీసుకోండి. అర్హత ఉంటే సరైన సమగ్ర వివరాలతో తిరిగి మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి తిరస్కరించినప్పటికీ తిరిగి మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య బీమా కంపెనీ స్పందన సరిగా లేకుంటే, లేదా 30 రోజుల్లోపు క్లెయిమ్ కు సంబంధించి ఎలాంటి స్పందన లేకుంటే... తదుపరి 30 రోజుల్లోపు హెల్త్ ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించి లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేయడం ద్వారా తగిన న్యాయం పొందవచ్చు. 

అవసరానికి 'లోన్' పొందడం ఎలా?


అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా... అన్న గేయం ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటలో చెప్పినట్టు అందరూ పప్పు కూడు కోసమే అప్పు చెయ్యరు. కొంత మందికి అవసరం. కొంత మందికి ఆకలి బాధ. అప్పు లేనిదే పూట గడవని వారు ఎందరో ఉన్నారు. మరి అవసరంలో ఆదుకునే రుణాలు ఏమున్నాయి...?. ఒక్కసారి అన్నింటినీ తెలిసేసుకుంటే అవసరంలో అప్పు పుట్టించడం తేలికవుతుంది!  
రుణాలు
వ్యక్తిగత రుణాలు, ఆస్తులపై రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, క్రెడిట్ కార్డ్, బంగారంపై రుణాలు, వినియోగదారుల రుణాలు, పెన్షన్ పై రుణాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు ఇలా అవసరంలో అక్కరకు వచ్చే రుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ రుణాలన్నీ కూడా వ్యక్తిగత ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించుకోతగినవే. అదే గృహరుణం, విద్యా రుణాలు, వ్యవసాయ రుణాల వంటి వాటిని ప్రత్యేకంగా ఆయా అవసరాలకు మాత్రమే వినియోగించుకోతగిన రుణాలు.  
పర్సనల్ లోన్... వాస్తవాలు
అవసరం ఏదైనా గానీ అర్హత ఉంటే వ్యక్తిగత రుణం వెంటనే లభిస్తుంది. ఈ రుణం కోసం చాంతాండంత ప్రక్రియ ఉండదు. వేతన జీవులు లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారు తగిన ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడం ద్వారా రుణాన్ని సంపాదించవచ్చు. నికరంగా వచ్చే నెలవారీ ఆదాయంలో 40 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని ఖరారు చేస్తారు. రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకు అర్హతను బట్టి రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్లలోపే ఉంటుంది. వడ్డీ ఎంతుంటుందన్న విషయాన్ని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. రుణం తిరిగి చెల్లించే సత్తా, వేతన స్థాయి, రుణ చరిత్ర ఇలాంటి విషయాలను కంపెనీలు, బ్యాంకులు చూస్తాయి. 13 శాతం నుంచి 32 శాత వరకు వడ్డీ విధించవచ్చు. అర్హత సరిపోకపోతే మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల్లో దరఖాస్తుదారుల అర్హతకు అనుగుణంగా ప్రాసెసింగ్ చార్జీలను బ్యాంకులు విధిస్తున్నాయి.  
రుణం జారీ చేసే ముందు...
ఏ కంపెనీ అయినా ప్రస్తుతం రుణాలు ఇచ్చే ముందు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) రిపోర్టు చూస్తున్నాయి. ఇందులో ఓ వ్యక్తికి సంబంధించి అప్పటి వరకు తీసుకున్న అన్ని రుణాల వివరాలు ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అది సిబిల్ రికార్డుల్లోకి చేరిపోతుంది. దీని వల్ల ఒక వేళ రుణం లభించినా వడ్డీ రేటు పెరిగిపోతుంది. రుణం తీర్చే గడువు నాలుగేళ్లు. కానీ మూడేళ్లకే మొత్తం తీర్చేస్తే కొంత జరిమానా భరించాల్సి ఉంటుంది. ఇది మిగిలి ఉన్న బకాయిలో 5 శాతం మేర ఉండవచ్చు. ఇది కూడా చూడాల్సిన అంశమే.  
భిన్న రకాల వడ్డీ
స్థిర వడ్డీ, చర వడ్డీ ఉంటుంది. అలాగే, ఫిక్స్ డ్ ఫ్లాట్ రేట్, రెడ్యూసింగ్ బ్యాలన్స్ రేటు అని కూడా ఉంటాయి. ఫిక్స్ డ్ ఫ్లాట్ రేటు విధానంలో నెల నెల వాయిదాలు చెల్లిస్తున్నా గడువు తీరే వరకు రుణం మొత్తం అలానే ఉంటుంది. రెడ్యూసింగ్ బ్యాలన్స్ రేటు విధానంలో రోజువారీ, నెలవారీ, మూడు నెలలకోసారి, లేదా వార్షికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణం మొత్తం గడువు తీరే లోపు అసలు, వడ్డీ కలిపి మొత్తం ఎంత వ్యయం అవుతుందో ముందుగానే అడిగి తెలుసుకోవాలి. తక్కువ వ్యయం అయ్యే రుణమే నయం. అలాగే, నిబంధనలు, షరతులు చూడాలి. 
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 
* ఐసీఐసీఐ బ్యాంకు 13.49% - 17.50% వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కింద  0.5 - 2.25% వరకు చార్జ్ చేస్తోంది. ముందస్తు రుణం చెల్లింపులపై 5 శాతం జరిమానాగా చెల్లించుకోవాలి.
* హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 12.74% - 19.50% వడ్డీ రేటు ఉంది. ప్రాసెసింగ్ చార్జీ 1.75 - 2.25% ఉంది. రుణం పది లక్షల రూపాయలు దాటి ఉంటే ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. లేకుంటే 4 శాతం వసూలు చేస్తోంది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.60% - 1510% వడ్డీను వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు  1.01% శాతమే. ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. 
* యాక్సిస్ బ్యాంకులోనూ వడ్డీ రేటు 15% - 20% శాతంగా ఉంది. ప్రాసెసింగ్ చార్జీ కింద 2 శాతం చెల్లించుకోవాలి. ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. 
* బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేట్లు 15 నుంచి 17% శాతం మధ్య ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంది. ముందస్తు రుణం తీర్చివేతపై 4 శాతం రాబడుతోంది. 
క్రెడిట్ కార్డుపై రుణం
ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ నెలకు 25వేల రూపాయలు అంతకంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్నవారికి బ్యాంకులు ఇతర సంస్థలు పిలిచి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. అయితే, 1.50 లక్షల నుంచి 1.80 లక్షల్లోపు వేతనం ఉన్నవారికి కూడా ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులను సంస్థలు జారీ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ విజయా బ్యాంకు అయితే రూ.60వేల వేతనం ఉన్నవారికి కూడా క్రెడిట్ కార్డు అందిస్తోంది. లేదంటే కనీసం 25వేల రూపాయల నుంచి 50వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ తర్వాత క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కార్డు తప్పకుండా జారీ అవుతుంది.
క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు తమ పే స్లిప్, బ్యాంకు స్టేట్ మెంట్, నివాస, గుర్తింపు ధ్రువీకరణలు, పాన్ కార్డు కాపీని అందజేయాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి, వృత్తుల్లో ఉన్నవారు ఆదాయపన్ను రిటర్నుల కాపీలను లేదా చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు సాధారణంగా నెలకు 1.5 నుంచి 2.99 శాతం వరకు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.50 శాతం స్థాయిలో వడ్డీని చార్జ్ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీలపై వడ్డీ పడుతుంది.  
బంగారంపై రుణం
బంగారు ఆభరణాలు ఇంట్లో బీరువాలో ఉంటే పిల్లలు పెడతాయా...? తీసుకెళ్లి దాన్ని కుదువపెట్టి చక్కగా రుణాన్ని పొందవచ్చు. అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. సాధారణంగా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డుపై రుణాలు సంస్థలకు సురక్షితమైనవి కావు. వీటిలో రిస్క్ ఉంటుంది. ఆభరణాలు, లేదా స్వచ్ఛ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాలు సురక్షితమైనవి. తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చకుండా ఉండే అవకాశాలు తక్కువ. ఒకవేళ చెల్లించకున్నా బంగారాన్ని వేలం వేసుకుంటాయి. 
బంగారంపై రుణం గంటల్లో మహా అయితే ఒకటి రెండు రోజుల్లో లభిస్తుంది. బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. నెలనెలా వడ్డీ చెల్లించవచ్చు. లేదంటే కాల వ్యవధి చివర్లో వడ్డీ, అసలు మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంది. అయితే, వడ్డీ రేటు ఎంతుంటుంది అన్నది పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రూపాయి కంటే తక్కువ వడ్డీకి ఏ సంస్థా రుణాన్ని ఇవ్వడం లేదు. వాస్తవంగా చూస్తే వడ్డీ రేటు రూపాయి నుంచి రెండు రూపాయల వరకు ఉంటోంది . 
10 లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తనఖా పెడితే ఏడున్నర లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. కానీ, మీరు ఐదు లక్షల రూపాయలే తీసుకున్నారని అనుకుంటే అప్పుడు మార్జిన్ పరంగా మీపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఒకవేళ బంగారం విలువ తగ్గి తనఖా పెట్టిన బంగారం విలువ ఏడు లక్షల రూపాయలకు దిగిపోతే అప్పుడు రుణం తీసుకున్న వారు హామీగా అదనంగా రూ.50వేల బంగారాన్ని హామీగా ఉంచాలి. లేదా నగదు చెల్లించాలి. అందుకే రుణం వెసులుబాటును పూర్తిగా వినియోగించుకోకుండా కొంత తక్కువే తీసుకున్నట్టయితే ఆటు పోట్ల సమయంలో నిశ్చింతగా ఉండవచ్చు. ఇలా అర్హత కంటే తక్కువ రుణం తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే సంస్థలు ఉన్నాయి.  
18 నుంచి 24 క్యారట్ల బంగారాన్ని తనఖా పెట్టుకోవచ్చు. స్టోన్స్ ఇతరత్రా ఉంటే వాటిని మొత్తం బరువులోంచి తగ్గిస్తారు. సాధారణంగా బంగారం రుణాన్ని పొందడానికి పాన్ కార్డు, వోటర్ ఐడీ లేదా పాస్ పోర్టు వంటి ఏదో ఒక పత్రం ఇస్తే సరిపోతుంది. చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి. కొన్ని సంస్థలు ఇంటి ఇల్లాలి నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని కూడా అడుగుతున్నాయి. రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు కూడా అవసరం. 
వెయ్యి నుంచి కోటి రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. వడ్డీ రేటును రోజువారీ బ్యాలన్స్ పై విధిస్తుంటాయి. మధ్య మధ్యలో అసలుకు కొంత మొత్తం అదనంగా కట్టేందుకు అనుమతిస్తున్నాయి. సమయానికి వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే 2 శాతం వరకు జరిమానా చెల్లించుకోవాలి. రుణం జారీ సమయంలో ప్రాసెసింగ్ చార్జీ 2శాతం వరకూ ఉంటుంది. బంగారంపై రుణం సమయంలో విలువ మదింపు చార్జీ పేరుతో కొంత చెల్లించుకోవాలి. రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే సంస్థలు ఒకటికి మూడు సార్లు నోటీసులు జారీ చేస్తాయి. అప్పటికీ స్పందించకుంటే తనఖాగా ఉన్న బంగారాన్ని వేలం వేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. 
బంగారం భౌతిక రూపంలోనే ఉండాలని లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో... అంటే గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) పైనా రుణాన్ని సులభంగా పొందవచ్చు. రుణం చెల్లింపు కాల వ్యవధి సాధారణంగా ఏడాది ఉంటుంది. కొన్ని సంస్థలు మూడు నెలలుగానే నిర్దేశించి ఆ గడువు తర్వాత పునరుద్ధరించుకుంటూ వెళుతున్నాయి. 
బంగారంపై తాకట్టు, నెలవారీ వాయిదాలు చెల్లించడం అసౌకర్యంగా భావించే వారు ఆభరణాలను మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవచ్చు. రుణం తీసుకుంటే నెలవారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆభరణాలు విక్రయించినట్టయితే నెలనెలా కొంత మొత్తంతో తిరిగి బంగారం కొనుగోలు చేస్తూ వెళితే అమ్మేసిన మొత్తాన్ని తిరిగి కొంత కాలంలోనే సొంతం చేసుకోవచ్చు.  
ఇన్సూరెన్స్ పాలసీలపై రుణాలు
ఇన్సూరెన్స్ అన్నది అనుకోని సంఘటనే జరిగితే తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకునేది. కానీ, అత్యవసరంగా నగదు అవసరం అయితే ఇన్సూరెన్స్ పాలసీ పత్రాన్ని హామీగా ఉంచి రుణాన్ని పొందవచ్చు. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు సైతం బీమా పత్రాలను తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తున్నాయి. అయితే, సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలపైనే రుణం లభిస్తుందని మర్చిపోవద్దు. అది కూడా పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాతే. మూడేళ్లు పూర్తి అయిన పాలసీలకే సరెండర్ వేల్యూ (స్వాధీన విలువ) వస్తుంది. ఆ విలువపైనే ఎంత రుణం ఇవ్వాలనేది సంస్థలు నిర్ణయిస్తాయి. స్వాధీన విలువలో 90 శాతం వరకు రుణం లభిస్తుంది. 
గోల్డ్ లోన్ వలే బీమా పత్రాలపై రుణం కూడా సులభంగానే పొందవచ్చు. సెక్యూర్డ్ రుణాలు కనుక తిరస్కరించే అవకాశాలు చాలా చాలా తక్కువ. హామీగా బీమా పాలసీ పత్రం ఉంటుంది కనుక పెద్ద ప్రహసనం ఏమీ ఉండదు. ఫొటో ఐడెంటిటీ, చిరునామా గుర్తింపు పత్రాలు, ఫొటో కాపీలు అందజేస్తే సరిపోతుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 12.50 నుంచి 19.50 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజును 2.5 శాతం విధిస్తోంది. గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తోంది. కాల వ్యవధి ఏడాది నుంచి ఐదు సంవత్సరాలు.
టాటా క్యాపిటల్ సంస్థ కూడా 12.50 శాతం నుంచి 19.50 వడ్డీ రేటును, 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు 11.49 నుంచి 17.50 శాతం వడ్డీ రేటును, 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ అయితే 15.75 శాతం వరకు వడ్డీ రేటు, ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ఎస్ బీఐ 17.65 శాతం వడ్డీ, ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటోంది. కాల వ్యవధి అనేది దాదాపుగా అన్ని కంపెనీల్లోనూ ఏడాది నుంచి ఐదేళ్ల వరకే ఉంది. 
ఎల్ఐసీ మాత్రం తన పాలసీదారులకు పాలసీ పత్రాలపై 10 శాతం వడ్డీ రేటుకే రుణాలను అందిస్తోంది. వడ్డీ కూడా ఆరు నెలలకు ఓ సారి చెల్లిస్తే సరిపోతుంది. అసలు రుణాన్ని పాలసీ కాల వ్యవధి తీరే వరకు కొనసాగించుకునే సదుపాయం ఉంది. చివరిగా సెటిల్ మెంట్ అప్పుడు రుణాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అందుకే పాలసీలపై రుణం కోసం బీమా కంపెనీలను ఆశ్రయించడం వల్ల తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది.
బ్యాంకు లేదా ఎన్ బీఎఫ్ సీ సంస్థ లేదా బీమా కంపెనీ నుంచి రుణాలను పొందేందుకు ముందుగా ఆయా సంస్థలను సంప్రదించాలి. దరఖాస్తును ఇవ్వడంతోపాటు పాలసీ పత్రాన్ని తనఖా పెడుతున్నట్టు రాసి ఇవ్వాలి. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవు. రుణ చరిత్ర ఇతర గోల కూడా ఉండదు. సులభంగా రుణం లభిస్తుంది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి పాలసీలపై రుణం మంచి ఐడియాగా చెబుతారు.
విఫలమైతే...
బీమా పాలసీలపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఓ వ్యక్తి విఫలమయ్యాడని అనుకుందాం. ఓ రోజు ప్రమాదవశాత్తూ పాలసీదారుడు మరణించినట్టయితే... అప్పుడు నామినీలు పాలసీదారుడు బతికున్న సమయంలో తీసుకున్న రుణం, వడ్డీని పూర్తిగా చెల్లించి పాలసీ పత్రాన్ని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. తీర్చలేకుంటే బీమా సంస్థ అందించే పరిహారంలో రుణం, వడ్డీలకు చెల్లింపులు పోను మిగిలిన మొత్తం నామినీకి అందుతుంది. అసలు రుణం, వడ్డీ బకాయిలు కలిపి పాలసీ స్వాధీన విలువకు చేరిన వెంటనే ఆ పాలసీ కథ ముగిసినట్టే. దాన్ని సరెండర్ చేయడం ద్వారా ఆ మొత్తాన్ని రుణం ఇచ్చిన సంస్థ మాఫీ చేసుకుంటుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్లపై రుణం
రెండు మూడేళ్ల తర్వాత ఓ ముఖ్య అవసరం కోసమని కొంత నగదును ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఈ లోపు అత్యవసరం ఏర్పడింది. వెంటనే నగదు కావాలి. బంగారం కుదువపెడదామంటే ఆభరణాలే లేవాయె. స్నేహితులును, బంధువులను అడిగితే కాదన్నారు. ఇక మీకున్న ఒకే ఒక అవకాశం ఫిక్స్ డ్ డిపాజిట్. డిపాజిట్ రద్దు చేసి నగదు వెనక్కు తీసుకుంటే మళ్లీ పొదుపు చేయలేమో...? అన్న సందేహం. దీంతో డిపాజిట్ చేసిన బ్యాంకుకు వెళ్లి దానిపై రుణం తీసుకోవచ్చు. దీన్నే ఓడీ ఫెసిలిటీ అని కూడా అంటారు. హామీగా ఆ డిపాజిట్ పత్రాన్ని తమ దగ్గర ఉంచుకుని డిపాజిట్ విలువలో 80 శాతం నుంచి 90 శాతం వరకు బ్యాంకులు రుణం ఇస్తాయి. వడ్డీ కూడా చాలా తక్కువే. డిపాజిట్ పై బ్యాంకు ఇస్తున్న వడ్డీ రేటు కంటే రెండు శాతం అదనం.
ఉదాహరణకు డిపాజిట్ పై 7 శాతం వడ్డీ రేటు ఉంటే 9 శాతం వడ్డీకే రుణాన్ని తీసుకుని నింపాదిగా ఉండవచ్చు. పైగా డిపాజిట్ ను కదిలించకుండా ఉంటారు. దానిపై వచ్చే వడ్డీ రేటును చూసుకుంటే తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ రేటు నికరంగా 2 శాతమే. దాదాపుగా చాలా బ్యాంకులు రుణం జారీకి ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయడం లేదు. రుణం కాల వ్యవధి డిపాజిట్ మెచ్యూరిటీ గడువు వరకు ఉంటుంది. వడ్డీ రోజువారీగా లెక్కిస్తారు కనుక ముందస్తు చెల్లింపులపై ఎలాంటి జరిమానాలు విధించడం లేదు. ఒక వేళ మీ దగ్గర డిపాజిట్ కూడా లేదనుకుందాం. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర కనీసం డిపాజిట్ పత్రం ఉంటే ఓడీ ద్వారా ఇవ్వమని కోరండి. బ్యాంకు వడ్డీ రేటు కంటే అదనంగా రెండు శాతం ఇస్తామని ఆఫర్ చేయండి.
ఆస్తులపై రుణాలు
ఇళ్లు, ఇతర ఆస్తులను తనఖా ఉంచి వాటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. మార్కెట్ విలువపై 50 శాతం వరకు రుణం వచ్చేందుకు అవకాశం ఉంది. కొన్ని 70 శాతం వరకూ రుణాలిస్తున్నాయి. లేదా రుణం తీసుకునే వారు నెలవారీ ఆర్జనకు 30 నుంచి 40 రెట్ల వరకు రుణం వస్తుంది. ఉదాహరణకు నెలకు 20వేల రూపాయలు అందుకుంటుంటే గరిష్ఠంగా రూ.8లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 13 నుంచి 16 శాతంగా ఉంది. సాధారణంగా ముఖ్యమైన అవసరాలకే ఆస్తులపై రుణానికి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
ఈ రుణాలపై వడ్డీ స్థిరంగా లేదా చలనంగా ఉండవచ్చు. ప్రభుత్వ రంగ ఎస్ బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా వంటివి తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. పైగా ముందస్తు రుణం తీర్చివేతపై రుసుములు విధించడం లేదు. సాధారణంగా ప్రాపర్టీ రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ 0.5 శాతం నుంచి 1.5 శాతం (రుణం విలువపై) వరకు ఉంది. ఏడాది నుంచి పదేళ్ల వరకు రుణం తీర్చేందుకు గడువు ఉంటుంది. తర్వాత మరో ఐదేళ్లు పొడిగించే అవకాశం కూడా ఉంది. వడ్డీ రేటు పరంగా చూస్తే వ్యక్తిగత రుణం కంటే ప్రాపర్టీపై రుణమే చౌక. పైగా వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఐదేళ్లు. ప్రాపర్టీ రుణాన్ని నిదానంగా అయినా తీర్చేయవచ్చు.
ఇల్లు, ఫ్లాట్, ప్లాట్, వాణిజ్య భవనం వీటిలో ఏదైనా సరే రుణానికి చెల్లుబాటు అవుతాయి. తీసుకునే వారి పేరుపైనే ఆస్తి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, ఆస్తి ఇద్దరు ముగ్గురు పేరిట ఉంటే అందరూ కలసి రుణానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆస్తులకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు ఉండాలి. బ్యాంకులు నివాస, గుర్తింపు ధ్రువీకరణల కింద రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా టెలిఫోన్ బిల్లు, పాన్ కార్డు అడగవచ్చు. వేతన జీవి అయితే గత ఆరు నెలల కాలానికి బ్యాంకు స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వయం ఉపాధిలో ఉన్నవారు గత రెండేళ్ల ఆదాయంపై చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి స్టేట్ మెంట్ తీసుకుని సమర్పించాలి. 
పీపీఎఫ్ ఈపీఎఫ్ పై కూడా రుణం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లపై కూడా రుణం తీసుకునే సౌకర్యం ఉంది. ప్లాట్ కొనుగోలు, వైద్య చికిత్స, విద్య, వివాహం, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు లేదా గృహరుణం తీర్చేందుకు, ఇల్లు నవీకరణ, ముందస్తు పదవీ విరమణ సందర్భాల్లోనే ఈఫీఎఫ్ పై రుణం తీసుకోగలరు. పీపీఎఫ్ పై ఇలాంటి పరిమితులు లేవు. మూడో ఏడాది నుంచి ఆరో ఏడాదిలోపు రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు పీపీఎఫ్ ఖాతాను 2011-12వ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తే... మూడో ఏడాది అయిన 2014-2015 నుంచి ఆరో ఏడాది అయిన 2017-2018 లోపు రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది. రుణం తీసుకుంటున్న తేదీకి అంతకుముందు ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉన్న బ్యాలన్స్ పై 25 శాతం రుణమే లభిస్తుంది. ఆరో ఏడాది తర్వాత రుణానికి అవకాశం లేదు.
ఎందుకంటే పీపీఎఫ్ ప్రారంభించి ఆరేళ్లు పూర్తయితే నేరుగా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. నాలుగో ఏడాది చివరికి ఖాతాలో ఉన్న నగదు బ్యాలన్స్ పై 50 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. పీపీఎఫ్ పై రుణాన్ని ఏక మొత్తంలో లేదా 36 నెలల కాలంలో నెలవారీగా తీర్చివేయవచ్చు. పీపీఎఫ్ పై ప్రభుత్వం చెల్లించే వడ్డీ రేటుకు అదనంగా రెండు శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. 36 నెలల్లోపు రుణం తీర్చివేయకపోతే అదనంగా ఆరు శాతం వడ్డీ రేటు విధింపు ఉంటుంది. దీన్ని ఏటా పీపీఎఫ్ ఖాతా బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించేస్తే తిరిగి మళ్లీ తీసుకోవచ్చు. 
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి అమ్మేద్దామంటే మార్కెట్లు బలహీనంగా ఉన్నాయా...? ఏం పర్వాలేదు. వీటిపై కూడా రుణం తీసుకోవచ్చు. కాకపోతే విలువ మొత్తంపై రుణం 50 శాతానికి మించదు. దీన్నే మార్జిన్ లేదా హెయిర్ కట్ అంటారు. పైగా అన్ని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై రుణం ఇవ్వరు. ఎంపిక చేసిన జాబితాలోని షేర్లు, ఫండ్స్ పైనే రుణం లభిస్తుంది.
ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే 10 నుంచి 12 శాతం వడ్డీయే వసూలు చేస్తోంది. ప్రభుత్వ రంగ ఎస్ బీఐ అయితే, ఇంకా తక్కువ వడ్డీకే ఇస్తోంది. రుణం తీర్చివేసే వరకూ వాటిని విక్రయించుకునే వీలుండదు.
వేతన ఖాతా నుంచి ఓవర్ డ్రాఫ్ట్
సేవింగ్స్ ఖాతాల నుంచి బ్యాలన్స్ కంటే అధిక మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ వేతన ఖాతా నుంచి ఓ నెల వేతనాన్ని అత్యవసరాల్లో డ్రా చేసుకునే సౌకర్యాన్ని పలు బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచి రూ.10వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. వడ్డీ రేటు 12 శాతం నుంచి 20 శాతం మధ్య ఉంటుుంది. 
వడ్డీ వ్యాపారులే దిక్కు...!
ఇక ఎక్కడా రుణం పుట్టకపోతే చివరిగా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యక్తుల దగ్గర నుంచి సాయం పొందడమే. వీరు 2 నుంచి 5 రూపాయల వడ్డీ వరకు వసూలు చేస్తుంటారు. ఇంతకంటే ఎక్కువ పిండుకునే వారు కూడా ఉన్నారు.